May 17, 2017

అమృత లత అపురూప పురస్కారాలు




కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలు 1955లో మొదలైనప్పటి నుంచీ కిందటి సంవత్సరం అంటే 2016 వరకు 56 మంది తెలుగు సాహితీవేత్తలకి లభించాయి. అయితే ఇందులో కేవలం అయిదుగురు మాత్రమే మహిళలు. మహిళల కృషినీ, సృజన శక్తినీ గుర్తించాలన్నా, గౌరవించాలన్నా మన సమాజానికి కొంత సంకోచం. గురజాడ కన్నా పదేళ్ల ముందే భండారు అచ్చమాంబ ‘ధనత్రయోదశి’ కథని వ్రాసినా ఇప్పటికీ మొదటి కథ వ్రాసింది గురజాడ అనే అంటారు చాలామంది సాహిత్యాభిలాషులూ, సాహితీ వేత్తలూ. ఒకే పనికి స్త్రీ పురుషుల వేతనాలలో వివక్ష  చూపే వ్యవస్థ ఇంకా అలాగే ఉంది అనేక రంగాల్లో. 

ఇలాంటి పరిస్థితుల్లో భాగ్య నగరంలోని మహిళా రచయిత్రులు కొందరు కలిసి, సఖ్యసాహితి, లేఖిని వంటి సంస్థల ద్వారా తమలో తామే ప్రతి ఏటా ప్రతిభావంతులైన రచయిత్రులనెన్నుకుని పురస్కారాలనిచ్చే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అంతర్జాలం సహాయంతో ముఖపుస్తకంలో ప్రమదాక్షరి అనే ఒక సమూహంగా కూడా సంఘటితమై తరచుగా కలుసుకుంటూ, అనేక కార్యక్రమాలని నిర్వహించుకుంటున్నారు. ఈ మహిళలందరి మధ్యా పరిమళించే సుహృద్భావం, స్నేహం ఎందరికో స్ఫూర్తిదాయకంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. 

స్త్రీవాద పత్రిక ‘భూమిక’ స్త్రీ సమస్యలని చర్చించుకోవడం కోసం, పరిష్కార దిశగా ప్రయత్నం చేయడం కోసం, వివిధ రంగాల్లో ఎంతో కృషి సల్పినప్పటికీ గుర్తింపు లభించని స్త్రీమూర్తుల గురించి నవతరానికి పరిచయం చేయడం కోసం - ప్రత్యేకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే పురస్కారాల ప్రసక్తి ఇందులో లేదు.

ఈ నేపధ్యంలో గత ఏడు సంవత్సరాలుగా అమృతలత గారు ‘అపురూప’ పురస్కారాలని ప్రవేశపెట్టి అనేకరంగాల్లో ప్రతిభావంతులైన స్త్రీ మూర్తులను గుర్తించి, పురస్కారాలతో గౌరవించే పని తలకెత్తుకున్నారు. ఇది ఏటా, మాతృ దినోత్సవం నాడు సాగే ప్రక్రియ. కొన్ని లక్షల వ్యయంతో, కొన్ని నెలల ముందు నించీ సాగే  ఏర్పాట్లతో ఈ కార్యక్రమం అపురూపంగా జరుగుతూ వస్తోంది. 

అమృతలత గారు నిజామాబాద్ సమీపంలోని ఆర్మూరులో అనేక విద్యాసంస్థలు నెలకొల్పి, గొప్ప దార్శనికతతో వాటిని నిర్వహిస్తున్న విద్యావేత్త. అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాత. స్వయానా మంచి రచయిత్రి. ‘సాహిత్య పరిమళం లేనిదే చాలా కళలు రాణించ లేవు. ముఖ్యంగా నృత్యానికి సాహిత్యానికి, గానానికి సాహిత్యానికి, సినిమాలకి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అవి పరస్పరాధారిత కళలు. మిగతా కళలకి ఇచ్చినంత ప్రాధాన్యత- పూలదండలోని దారంలా ఆ కళల వెనకాల దాగివున్న సాహిత్యానికీ, ఆయా రచయితలకూ ఇవ్వడంలేదన్న స్పృహ వల్ల ఈ అవార్డుల్లో సింహభాగం నవల, కథ, కవిత, సాహిత్య విమర్శ, జర్నలిజం తదితర ప్రక్రియలకి ఇవ్వడం జరుగుతోందని అమృతలత గారన్న మాటలు విన్నపుడు ఆమె ఆలోచనాత్మకత ముచ్చట గొలుపుతుంది. మనం సాహిత్య సభలని నిర్వహిస్తే రానురాను సాహిత్యానికి, ఇతర లలిత కళలకి దూరమవుతున్న యువ తరానికి వాటిపట్ల ఆసక్తి, అనురక్తి కలుగుతుందనీ, సాహిత్య సభలకి పూర్వవైభవం చేకూరుతుందనీ చెపుతూ ఈ పురస్కారాల వెనక నేపథ్యాన్ని వివరిస్తారు డా.అమృతలత.

ఇక పురస్కార ప్రదానోత్సవం దగ్గరకొస్తే, ఆ పండుగ ఏర్పాట్లూ, ఆ సంరంభం చూసి తీరవలసిందే. తమ జీవిత కాలమంతా సాహిత్యంలో విశేష కృషి సల్పి, పాఠకుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే నవలారచన చేసిన రచయిత్రులకి ప్రతి సంవత్సరం అమృతలత జీవన సాఫల్య పురస్కారం’ పేర యాభై వేల రూపాయల నగదునీ, కథ, నాటిక, జీవిత చరిత్ర, కవిత, నాట్యం, సంగీతం వంటి అనేక రంగాలలో ప్రతిభ కనపరుస్తున్న మహిళలకు ‘అపురూప’ పురస్కారాల పేర పదివేల రూపాయల నగదునీ అందజేసి సన్మానించడం ఒక యాంత్రిక కార్యంలా కాక ఒక సౌందర్య భరితమైన వేడుకలా జరపడం అమృత లతగారికే చెల్లింది. మన సంప్రదాయంలో శుభకార్యాలకిచ్చే నగదు బహుమతులలో చివర సున్న సంఖ్య లేకుండా జాగ్రత్త పడడం అలవాటు. అపురూప పురస్కారాల్లో కూడా పదివేల చెక్కు పెట్టిన కవరుకి  నూట పదహారు రూపాయలుంచిన (పూర్వపు బంగారు వరహాల సంచీని గుర్తు చేసే) ఒక అందమైన సంచిని జత చేసి అందించడం నిర్వాహకుల ఈస్థటిక్ సెన్స్ ని చూపిస్తుంది
తెల్లని అందమైన శాలువ, చక్కని మొమెంటో, అభినందన పుస్తకాలు అయిదు కాపీలుంచిన ఫోల్డర్, సుమ గుచ్ఛం, చెక్కుకి జతగా నూటపదహార్లుంచిన పోత్లీ సంచీ- అందించి, ఇవన్నీ పెట్టుకుందుకు వీలుగా విశాలంగా ఉన్న ఒక పేపర్ బాగ్ కూడా అందించడం చూస్తే ఏ కార్యక్రమాన్నైనా రూపకల్పన చేయడంలో స్త్రీలు మనసారా పాల్గొంటే అది ఎంత అందంగా, సంపూర్ణంగా పూర్తవుతుందో తెలుస్తుంది.

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం  పొందిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి శ్రీమతి ఓల్గా గారితో పాటు, ఆకాశవాణిలో నలభై సంవత్సరాలకు పైగా కార్మికుల కార్యక్రమంలో చిన్నక్కగా సుపరిచితులైన శ్రీమతి రతన్ ప్రసాద్ గారికి కూడా ‘అమృతలత జీవన సాఫల్య పురస్కారా’న్ని అందించడం  ఈ ఏటి ఉత్సవ సంబరాన్ని రెట్టింపు చేసింది.  పురస్కారానికి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో అప్లికేషన్ల ప్రసక్తి లేకపోవడం, ప్రతి అవార్డు గ్రహీత ఎన్నికలోనూ  నలుగురైదుగురు న్యాయ నిర్ణేతల బృందం నిర్ణయించిన వ్యక్తికే ఏ విధమైన ఒత్తిడులూ లేకుండా పురస్కారం అందించడం, పురస్కార ప్రదానోత్సవ సభని కూడా స్త్రీలకే సొంతమైనవిధంగా సుందరంగా, ఆసక్తికరంగా తీర్చిదిద్దడం, ఆహూతులని ఆహ్వానించడం దగ్గరనుంచి సభ ముగిసి అంతా నిష్క్రమించేవరకు కళాకారులనీ, అతిధులనీ, ప్రేక్షకులనూ నిర్వాహక బృందం తమ ఇంట్లో శుభకార్యానికి వచ్చిన ఆహూతుల్లా భావించి ఆదరించడం, ఇదంతా ప్రతి ఏటా ఒకే రకమైన శ్రద్ధతో జరగడం- ఈ పురస్కారాలకొక గౌరవాన్నీ, అదనపు విలువనీ చేకూర్చింది. పురస్కారం అందించేటపుడు అందుకునేవారి కుటుంబ సభ్యులందరినీ కూడా వేదిక మీదికి రప్పించి ఆ ఉత్సవంలో వారూ పాలు పంచుకునేలా చేయడం నిర్వాహకుల ఉత్తమాభిరుచికీ సంస్కారానికీ చిహ్నంగా చెప్పుకోవచ్చు.
సభకు అతిధులుగా వచ్చే ప్రముఖుల గురించీ, పురస్కార గ్రహీతల గురించీ వారితో పరిచయమున్న వ్యక్తులు రాసిచ్చిన వ్యాసాలను, వారి ఛాయా చిత్రాలతో జత చేసి  ‘అభినందన’ పుస్తకంగా ఆవిష్కరించడం కూడా ఈ సభలో భాగం. గత ఏడు సంవత్సరాలుగా వీరు వెలువరించిన అభినందన పుస్తకాలన్నీకలిపితే దాదాపు వందమంది ప్రతిభాన్విత మహిళల గురించిన సంక్షిప్త వివరాలు, వారి జీవితపు అపురూప క్షణాలు, ఛాయా చిత్రాలు లభిస్తాయి. 

ఈ సంవత్సరం 'అభినందన' పుస్తకానికి ముఖ చిత్రం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మన్నెం శారదగారు వేయడమొక విశేషం. గౌరవ అతిధులుగా నవ్య ఎడిటర్ శ్రీ ఎ.ఎన్. జగన్నాధ శర్మ గారు, తొలి సినీ నేపధ్య గాయని శ్రీమతి రావు బాల సరస్వతి గారు, ప్రముఖ సినీ నటి శ్రీమతి గీతాంజలి గారు విచ్చేసిన ఈ కార్యక్రమంలో అపురూప పురస్కారాలు అందుకున్న రచయిత్రులూ కళాకారులూ- డా. సోమరాజు సుశీల( పారిశ్రామిక, విజ్ఞానశాస్త్ర, సాహితీ వేత్త), డా. మద్దాళి ఉషా గాయత్రి( కూచిపూడి నృత్యం), శ్రీమతి అత్తలూరి విజయ లక్ష్మి(నాటక రచన), డా. మృణాళిని( కాలమిస్ట్, వ్యాఖ్యానం, జర్నలిజం), శ్రీమతి శశికళా స్వామి( లలిత సంగీతం), శ్రీమతి వారణాసి నాగలక్ష్మి( కథా రచన), డా. భారతి(మహిళా వికాసం, వైద్యరంగం), శ్రీమతి గోగు శ్యామల( జీవిత చరిత్ర), డా.షాజహానా( కవిత్వం). చివరగా ఈ ఏడే కొత్తగా ప్రవేశపెట్టిన పురస్కారం పద్ధెనిమిది సంవత్సరాల లోపు వయసున్న యువ రచయిత్రికి పురస్కారం. ఇది కుమారి రక్షిత సుమ కి లభించింది.
అపురూప పురస్కారాల ప్రదానోత్సవంలో వ్యాఖ్యాతగా అందరి మన్ననలనూ పొందుతున్న శ్రీమతి నెల్లుట్ల రమాదేవిది మృదు గంభీరమైన కంఠం. చక్కని సమయస్ఫూర్తి, హాస్య ప్రియత్వం, సాహితీ కళారంగాలలో లోతైన అవగాహన అమెకున్న అదనపు అర్హతలు. కార్యక్రమం జరుగుతున్నంత సేపూ  సౌండ్ సిస్టమ్ టెక్నీషియన్స్ కి సూచనలందిస్తూ, సౌంజ్ఞలతో తమ టీమ్ ని సమన్వయపరుస్తూ ఆమె చేసే అష్టావధానం ఆమెకే సాధ్యం. వృత్తి రీత్యా బాంక్ మానేజర్ అయిన ఆమె, సభ మొదలైనప్పటి నుంచీ కార్యక్రమం పూర్తయ్యేవరకూ అలసటంటే ఎరగని దేవకాంతలా కనిపిస్తారు. తన వెనకున్న చోదక శక్తి అమృత లత గారే అంటూ, తనకే కాదు తమ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మహిళలందరికీ జీవితపు ఆటుపోట్లలో వెన్నుతట్టి నిలబడే అండ ఆమేనని రమాదేవి అన్నపుడు, అమృతలత ఒక శక్తి స్వరూపిణిగా కళ్లముందు కనపడతారు.  కళాకారిణులందరి పట్లా ఆమెకు సమానమైన ప్రేమాదరాలున్నారచయిత్రులంటే కాస్త ఎక్కువ అభిమానం. సంగీతాన్ని ప్రేమించే ఆమె అందులో ఇమిడిన సాహిత్యాన్ని శ్రద్ధగా వింటారు.
ఆమె నిర్వహిస్తున్న విద్యాలయాల్లో పనిచేస్తున్న స్త్రీలంతా ఒక్కసారిగా కనపడ్డపుడు ఆ సంఘటిత స్త్రీ శక్తి కొండంతలా కనబడి ఆశ్చర్యం కలిగింది. ఆర్మూరులోని ఆమె నివాసం ఆమె స్నేహితులందరికీ ఒక చలివేంద్రం, ఒక స్నేహ కుటీరం. ఎంతమంది వెళ్లినా ఆప్యాయతతో ఎదురొచ్చి ఆత్మీయత పంచిచ్చే అపురూపవనిత ఆమె. మిత భాషీ, మృదు భాషీ అయిన ఆమె ఇంతమంది స్టాఫ్ కి ఎలా మార్గనిర్దేశనం చేస్తారా, ఇన్ని సంస్థలని క్రమశిక్షణతో ఎలా నిర్వహిస్తారా అని ఆశ్చర్యం కలగక మానదు. ఆమె పరివారమంతా కూడా సేవాదృక్పథం నిండినవారే కావడం గొప్ప విషయం.


అహూతులందరి చేతా వచ్చిన క్రమంలో సంతకాలు పెట్టించి, సభ ముగిసే ముందు మంచి మంచి సర్ప్రైజ్ గిఫ్టులివ్వడం, కార్యక్రమం మధ్యలో తమ సంస్థల్లోని ఉద్యోగుల చేత చిన్నచిన్న స్కిట్స్, బృంద నాట్యాలు చేయిస్తూ, సందేహించేవారిని ప్రోత్సహిస్తూ సూత్రధారిగా అమృతలతగారు చేస్తున్న పని అసామాన్యమైనది. ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా’ అన్న పాట స్థానే ‘ఎవరో చూస్తారని, ఏదో అంటారని, బెదరిపోయి నిలచిపోకుమా’ అంటూ వారిలోని సృజనశీలతకు పదును పెట్టి, ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని ఒక సరదా కార్యక్రమంగా తీర్చిదిద్దడం వెనుక ఆమె సమాజానికి అందించే ఒక సందేశం ఉంది. అది అంతర్లీనంగా ఉన్నా విస్పష్టంగా కనిపిస్తుంది. అందుకు ఆమెను మనమంతా అభినందించాల్సి ఉంది.

                                                   **