December 30, 2015

   పొరుగింటీ మీనాక్షమ్మని…
“అసలీ గొడవంతా సూరీడు వల్లే వచ్చింది” కక్కలేక మింగలేక అవస్థ పడుతూ గొణుక్కుంది లావు. కుడి చేత్తో అన్నం కలుపుకుంటూ ఎడం చేత్తో ఫోన్లో మెస్సేజ్ లు తెరిచి చదువుకుంటూ నవ్వుకుంటున్నాడు ఆనందు.
“ఏం కాదు. అంతా నీవల్లే” అన్నాడు లావు కొడుకు సుమంత్. పిచిక తన మీదికి బ్రహ్మాస్త్రం వేసినట్టయింది లావుకి.
“నా వల్లా? నేనేం చేశానురా వెధవకానా?” అంది విస్తుపోతూ.
“నువ్వేగా మామయ్యనడిగి నాన్న ఫోన్లో వాట్సాప్ గ్రూపులన్నీ పెట్టించావు. అప్పట్నించీ నాన్న మాతో మాట్లాడ్డం, ఆడుకోవడం, స్విమ్మింగ్కి తీసుకెళ్లడం అన్నీ మానేశారు. లేచినప్పట్నించి ఆఫీసుకెళ్లేదాకా ఆ ఎస్సెమ్మెస్సులు చూసుకుంటూ ఆ వీడియో క్లిప్పింగులు చదువుకుంటూ ఉంటారు. అన్నం తినేపుడు కూడా మనతో మాట్లాడరు” అన్నాడు ఖోపంగా.
“అదికాదురా సూ! సూరీడత్త మామయ్య చూడు కాలుమీద కాలేసుకుని, స్మార్ట్ ఫోను పట్టుకుని  స్టైలుగా వాట్సాప్ లో ఫొటోలూ, విడియోలూ పంపుతూ బిజీగా ఉంటే, వాళ్లున్నరెండ్రోజులూ నాన్నేమో ఆ డొక్కు ఫోను తీసి గట్టిగా మాట్లాడుతూ, పనేమీ లేనివాడిలా జోకులేస్తూ నా వెంట తిరుగుతుంటే నాకు నామోషీగా అనిపించింది. అందుకే స్మార్ట్ ఫోను తెప్పించి ఏవో నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో ఆడ్ చేయించాను. ఎవరేనా మనింటికి వచ్చినపుడు ఇంటి యజమాని ఖాళీగా కనిపిస్తే పనికిమాలిన వాడనుకుంటార్రా బాబూ. నీకేం తెలుసు?” నొచ్చుకుంటూ నచ్చచెప్పబోయింది లావు.
“అన్నీ ఇలాగే చేస్తావు నువ్వు. సూరీడత్తా వాళ్లబ్బాయేమో ‘మీ నాన్నఎంచక్కా బోల్డంత సేపు మీతో గడుపుతారు. మా డాడీ చూడు ఎపుడూ ఫోను పట్టుక్కూచుంటారు’ అని ఎంత ఫీలయ్యాడో తెల్సా?”
సూ మాటలకి లావు ఆలోచనలో పడింది. భర్త తెలివైనవాడూ, ప్రయోజకుడూ అనుకోవాలని తను చేసిన ప్రయత్నం ఇలా బెడిసి కొడుతుందని తనేమన్నా కలగందా? నిజమే పూర్వం కూరలు పట్టుకు రావడం, వంటింట్లో తను సతమతమవుతుంటే తనూ ఓ చెయ్యి వెయ్యడం, పిల్లల్ని ఆటలకి తీసుకెళ్లడం చేసే వాడు కాస్తా ఇప్పుడు ఇంటికి రావడం తడవుగా ఆ ఫోను పట్టుకుని బాల్కనీలో సెటిలయిపోవడం, మెస్సేజిలన్నీ చూసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉండడం! అంతే కాకుండా ఆ మెసెజ్ లన్నీ తను చదివీ చదవక ముందే ఎవరో ఒకరికి ఫార్వార్డ్ చేసి పారేస్తూ ఉండడంతో మిగిలిన వాళ్లంతా విసుక్కుంటున్నారని తమ్ముడు చెప్పాడు. అప్పుడప్పుడు పొరబాటున  ఏ గ్రూపులో వచ్చిన వీడియో  క్లిప్పింగ్ ని ఆ గ్రూపుకే  మళ్లీ ఫార్వార్డ్  చేయడంతో అంతా అతన్ని వెర్రిబాగుల వాడిలా జమకడతారేమో అని బెంగ పట్టుకుంది. తనకి చిన్న వెధవ సుమంత్ బాధ కూడా బానే అర్ధమవుతోంది. పాపం వాడికి వాళ్ళ నాన్న దగ్గర చేరిక. ఒక్కసారిగా నాన్నలో ఇంత మార్పు వచ్చేసరికి వాడు తట్టుకోలేక పోతున్నాడు.
ఇలా అనుకోగానే లావుకి కొడుకు మీద ప్రేమ ముంచుకొచ్చింది. “సూ! ఇలారా కన్నా” అంటూ పిలిచింది. వాడు అలిగి చెట్టెక్కి కూర్చున్నాడు.
ఒకటికి రెండుసార్లు పిలిచేసరికి వాడికి చిర్రెత్తుకొచ్చింది. చిటికెన వేలు చూపిస్తూ “ సూసూ అంటూ పిలుస్తావేం? అన్నిటికీ నీకు సూరీడత్తతో వొంతు..అత్త వాళ్ళబ్బాయిని కే అని పిలుస్తుందని నువ్వు నన్ను సూ అనిపిలిస్తే ఎలా? రెండు మూడుసార్లు కేకే అన్నా బానే ఉంటుంది గాని సూసూ అంటే చెత్తగా ఉంటుంది” అన్నాడు.
లావు అనబడే లావణ్య, సూరీడు అనబడే సూర్య లక్ష్మిల స్నేహం వీధి బడి రోజుల నాటిది. అన్నిటా లావుకి సూరీడుతో పోటీ. ఇద్దరిదీ ఒకే వీధి. ఒకే వయసు. ఇద్దరికీ కాలేజీ చదువు పూర్తవుతూనే పెళ్లిళ్ళు కుదిరాయి. లావణ్యకి పెళ్లికొడుకు బ్రహ్మానందం చదువూ, ఉద్యోగం, నవ్వుమొహం అన్నీ నచ్చడంతో వెంటనే ఒప్పుకుంది గాని, పెళ్ళిమాటలు జరిగిన మర్నాడే సూరీడుక్కూడా పెళ్లి కుదరడం, ఆ వివరాలన్నీ తెలియగానే లావణ్య ముక్కు ఎగబీల్చుకుంటూ, కాళ్లూ చేతులూ విసురుకుంటూ ఇంటికి రావడం జరిగింది.
ఇంట్లోకి వచ్చీ రాగానే ‘నాకీ పెళ్లొద్దు’ అంటూ పేచీ మొదలు పెట్టింది. లావణ్య తల్లి, కామాక్షి కూతుర్ని బుజ్జగించి అడగ్గా అడగ్గా తేలిందేమిటంటే పెళ్లికొడుకు ఇంటి పేరు లావుకి ఎంతమాత్రం నచ్చలేదని. కూతురు ఆ సూరీడు ఇంటికెళ్లి వచ్చిందటే ఏదో ఓ కొత్త పేచీ మొదలుపెడుతుందని తెలిసినా, బట్టలో నగలో కొనమనో, కొన్నవి మార్చమనో  అంటుందనుకుంటే ఏకంగా కుదిరిన పెళ్లే వద్దనడంతో కామాక్షి ఖంగు తింది. అయినా తేరుకుని,
“ఇంటిపేరు నచ్చకపోవడమేమిటే? అయినా మొన్న అన్నిటికీ సరేనన్నావుగా? ఇప్పుడేమొచ్చిందీ?” అంది మెత్తగానే.
“నాకు నువ్వసలు ఇంటిపేరు చెప్పావా? సూరీడుకి వాళ్లమ్మగారు చెప్పార్ట నాక్కాబోయే పెళ్ళికొడుకు వివరాలన్నీ. ఇంటి పేరు ‘ప్రతివాద భయంకర’ అని తెలిసి అదేమో ‘భయంకర లావూ! భయంకర లావూ!‘ అని ఒకటే ఏడిపించడం” అంది ఏడుపు మొహంతో.
“నేనేవన్నా దాచి పెట్టానుటే.. ఇంటిపేరు ప్రసక్తి రాలేదు గనక చెప్పలేదు గాని” అంది వేగంగా ఆలోచిస్తూ.
 “ఏమిటో భయం పుట్టేలా అదేం పేరమ్మా.. నాకేం నచ్చలేదు” అంటూ తల్లిని చుట్టుకుపోయింది లావు.
 పెళ్లికొడుకు ఇంటి పేరుతో కూడా తంటా రావచ్చని ఊహించని కామాక్షి, “ఇంటి పేరులో ఏముందే పిచ్చితల్లీ .. పి.బి. లావణ్య అని రాసుకుంటావు గాని పూర్తి పేరు రాస్తావా ఏమిటి?” అంటూ నచ్చచెప్పబోయింది.
“రాయక పోయినా పిలవక పోయినా ‘ఇంటి పేరేమిటీ’ అంటూ ఎవరో ఒకళ్లు అడుగుతూనే ఉంటారు. సూరీడుకి కాబోయే అబ్బాయి ఇంటిపేరేమిటో తెలుసా? కలువకొలను!  అతని పేరేమో ప్రభాకర్! కలువకొలను ప్రభాకర్ ! ఎంత బావుందో చూడు. ఒక్క కలువ పువ్వు దోసెడు పూల పెట్టు. అలాంటిది కొలను నిండా కలువపూలుంటే ఎంత బావుంటుంది! కలువ పువ్వే బావుంటుందంటే కలువ కొలను ఇంకెంత బావుంటుంది!
“ఇతను చూడు… ప్రతివాద భయంకర బ్రహ్మానందం. ఒకవైపు భయంకరం.. ఇంకోవైపు  బ్రహ్మానందం.. ఏమన్నా అర్ధం ఉందా?  నాకేం వొద్దు ఇతనితో పెళ్లి” ఖచ్చితంగా చెప్పేసింది లావు.
కామాక్షి కార్య సాధకురాలు. కూతురితో మాట్లాడుతూనే చురుగ్గా ఆలోచన సాగించి,“ ఓసి నీ పిచ్చి బంగారం గానూ.. కలువకొలనేమిటీ, ప్రభాకర్ ఏమిటీ? ప్రభాకర్ అంటే సూర్యుడు కదా.. కలువ పూలు సూర్యుణ్ని చూస్తే వాడిపోతాయి! అసలా ఇంటి పేరుకీ అబ్బాయి పేరుకీ ఏమాత్రం కలవలేదు. ఆ మాట కొస్తే సూరీడుకి మాత్రం ఆ ఇంటి పేరు ఎలా సరిపోతుంది? దాని పేరు సూర్యలక్ష్మి కాకుండా చంద్రావతి అయితే సరిపోయేది. సూర్య లక్ష్మికీ కలువకొలనుకీ ఎలా చూసినా కలవదు.
“అదే మనకి వచ్చిన సమ్మంధం చూడు. నీ కాబోయే మొగుడు ప్రతి వాదులకి భయంకరుడూ, మనకి బ్రహ్మానంద స్వరూపుడూను! వెర్రి మొర్రి ఆలోచనలు పెట్టుకోకు. నీ అదృష్టానికి కుళ్లుకునే వాళ్లు బోల్డుమంది ఉంటారు. వాళ్ళేవో అవాకులూ చవాకులూ వాగితే పట్టించుకోకూడదు. మనం వదిలేసుకుంటే, వలేసి పట్టుకుందామని ఎందరో చూస్తూ ఉంటారు మరి” కూతురి జుట్టు సవరిస్తూ ముద్దుగా నచ్చచెప్పబోయింది.
“ఆ.. నువ్వలాగే ఏదో ఒక మాయ చేస్తావు. ‘ప్రతివాద భయంకర లావణ్య’ అంటే ఎలా ఉందో చూడు. ‘భయంకరంగా లావణ్యంగా ఉంద’ని దేన్నైనా అంటామా?  పెళ్లి అని తల్చుకుంటే చాలు ‘ఉరుములూ మెరుపుల మధ్య నేను వొణుక్కుంటూ నిలబడ్డ దృశ్యం’ కనిపిస్తోంది! ఇన్నాళ్లూ సూరీడు పేరుతో పోల్చుకుని నా పేరెంత అందంగా ఉందో అని మురిసిపోయేదాన్ని. ఇప్పుడు కేవలం చేసుకోబోయేవాడి ఇంటి పేరు వల్ల ఇన్నాళ్ల  సంతోషం ఒక్కసారిగా మాయమైపోతోంది. ఏమైనా సరే నాకీ సంబంధం వద్దు” బొటబొటా కళ్ల నీళ్లు కార్చింది లావు.
చిన్నప్పటి నుంచీ కూతుర్నిఅపురూపంగా పెంచుకొచ్చిన కామాక్షి, ఒళ్లుమండుతున్నా నిభాయించుకుని, కొంగుతో లావు కళ్లనీళ్లు తుడిచింది. లోపలికెళ్లి ఇంటిపేర్ల పుస్తకం ఒకటి తెచ్చిచ్చి” చిట్టి లావూ! నీకిష్టం లేకుండానే నీ పెళ్లి చేసేస్తాంటే అమ్మలూ? ఇదిగో ఈ పుస్తకం తిరగేసి చూడు. ఇందులో ఇంటి పేర్లన్నీ చదివితే ప్రతివాద భయంకర అన్న ఇంటి పేరు ఎంత హుందాగా ఉందో నీకే తెలుస్తుంది. పోనీలే అని ఈ సమ్మంధం వదిలేస్తే, తర్వాతొచ్చే సమ్మంధం ఇంతకన్నా నచ్చని ఇంటి పేరైతే ఏం చేస్తాం చెప్పు? ఒకవేళ ఇంటి పేరు బావున్నా పిల్లాడి పేరు సన్యాసిరావో, పిచ్చయ్య శాస్త్రో అయితే ఏం చేస్తాం? ఎన్నని అలా వదిలేస్తాం? ఇతని పేరు చక్కగా ఉంది. పేరుకి తగ్గట్టు నవ్వుమొహం. సైంటిస్టుగా ఉద్యోగం, బోలెడు జీతం…” అంటూ కామాక్షి ఏవేవో చెప్పుకుపోతుంటే లావు, తల్లి ఇచ్చిన పుస్తకం గబగబా తిరగేసింది.
 అందులో కొన్ని ఇంటి పేర్లు చదవగానే వికారపెట్టి, వాంతొచ్చినట్టయింది. తల్లి చెప్పిన మాట నిజమే అనిపించింది.
మొత్తం మీద లావుకీ, సూరీడుకీ ఆ వేసవిలోనే పెళ్లిళ్లు జరిగిపోయాయి. లావు పెళ్లికి సూరీడూ, సూరీడు పెళ్లికి లావూ , తాళికట్టు శుభవేళ పూలజడ ఎత్తి పట్టుకుని ఫొటోల్లో పడ్డారు. పెళ్లి తతంగాలు పూర్తై ఎవరిళ్ళకి వాళ్లు వెళ్లిపోయారు. లావు మనసులో ఇంటి పేరు తాలూకు అసంతృప్తి కొంత ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే భర్తతో లావు కాపురం సుఖంగా సాగిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక కూతురూ ఒక కొడుకూ. కూతురు సంగీతంలో కృతుల దాకా వచ్చింది.
సజావుగా సాగిపోతున్న వాళ్ల సంసార నావ, సూరీడు రాకతో మళ్లీ అల్లకల్లోలమయింది. త్యాగరాయ గాన సభలో  సూరీడు కూతురు డాన్సు ప్రోగ్రాం ఉండడంతో పదిహేనేళ్ల తర్వాత సూరీడు సకుటుంబంగా భాగ్యనగరం వచ్చి, పనిలో పనిగా లావుని చూడ్డానికి వచ్చింది. సూరీడు భర్తా, లావు భర్తా ఒకరికొకరు పరిచయమయ్యారు. ‘అయామ్ ప్రభాకర్’ అంటే  ‘బ్రహ్మానందం’ అంటూ కరచాలనం చేసుకున్నారు.
          ఇటీవలి కాలంలో జగమెరిగిన హాస్య నటుడిగా గొప్ప పేరు సంపాదించిన బ్రహ్మానందం, తెర మీద కనబడితే చాలు ప్రేక్షకుల్లోంచి తెరలు తెరలుగా నవ్వులు, ఈలలు వినపడడం మామూలే అయినా, భర్తని పరిచయం చెయ్యగానే సూరీడు మొగుడు ముసి ముసిగా నవ్వుకుంటున్నట్టు కనపడడంతో లావుకి అవమానం అనిపించింది. సూరీడూ వాళ్ళు వెళ్లిపోయినా అదే సన్నివేశం లావు ఆలోచనల్లో మళ్లీ మళ్లీ కదిలి మనశ్శాంతి లేకుండా చేసింది. పీ బీ బ్రహ్మానందం గా తమ సర్కిల్లో మంచి పేరు తెచ్చుకున్న మొగుడి పేరు విషయం లోఇప్పుడేం చెయ్యడానికీ తోచక పిచ్చెక్కినట్టయింది ఆమెకి. ఏ సమస్య వచ్చినా తల్లికి చెప్పుకునే లావు, ఇక తప్పేట్టు లేదని పుట్టింటికి బయల్దేరి వెళ్లింది.
దిగులు మొహంతో వచ్చిన కూతుర్ని చూసి మళ్ళీ ఏదో కొత్త తంటా వచ్చినట్టుంది అనుకున్న కామాక్షి, భోజనాలై ఇద్దరూ గదిలో నడుం వాల్చగానే విషయం తెలుసుకుని విస్తుపోయింది.
“ఇదేం పిచ్చే నీకూ? ఇన్నేళ్లొచ్చినా! హాయిగా కడుపుబ్బ నవ్వించే నటుడికీ అదే పేరుంటే సంతోషించాల్సింది పోయి దుఖ పడతారుటే ఎవరైనా? తెర మీద అతను కనపడగానే హాలంతా నవ్వులే! కేవలం అతనుంటే చాలు సినిమాకి పెట్టిన డబ్బులొచ్చేస్తాయి. అతనేమైనా విలనా? వేశ్యల వెంట తిరిగేవాడా? అంత మంచి హాస్య నటుడిక్కూడా అదే పేరుంటే నీకొచ్చిన బాధేమిటే తల్లీ?” అని తల పట్టుకుంది.
“కొడుక్కో అల్లుడికో ఆ పేరుంటే ఏమీ అనిపించదమ్మా… మొగుడికి ఆ పేరుంటే ఏం బావుండదు…కొత్తగా ఎవరితో పరిచయమైనా చేతులూపుకుంటూ ‘అయామ్ బ్రహ్మానందం’ అనుకుంటూ ఈయన చెప్పుకోవడం , వాళ్లు ముసిముసిగా నవ్వడం.. నీకేం తెలుస్తుంది ఆ బాధ? మొన్న సూరీడు మొగుడు వచ్చినపుడు పరిచయం చేస్తే, ‘అయామె గ్రేట్ ఫాన్ ఆఫ్ బ్రహ్మానందం అండీ’ అనుకుంటూ ఆయనేమో బ్రహ్మానందం నటించిన కామెడీ సీన్లేవో చెప్పడం, ఆయనతో పాటు ఈయనా తగుదునమ్మా అంటూ తనకి గుర్తొచ్చిన సన్నివేశాలూ డైలాగులూ చెప్పడం,  ఇద్దరూ పడీ పడీ నవ్వుకోవడం. నాకు తిక్క రేగిపోయింది” ఎర్రబడ్డ మొహంతో ఆవేశంగా అంది లావు.
కూతురి అవస్థ చూసి బాధ పడుతూ “అయ్యొ .. అతనేవో చెప్తే చెప్పాడు, ఇతను కూడా చెపాల్సిన పనేముందీ” అని దీర్ఘం తీసి “పోనీ అల్లుడు గారు తన పేరు బ్రహ్మానందం అని కాకుండా పీబీబీ ఆనంద్ అని చెప్పుకుంటే సమస్యే లేదుగా” అంది కామాక్షి.
“సర్లే ..ఆయనే ఉంటే ఈ బోడి గుండెందుకూ అందిట ఆవిడెవరో. మా మొండి ఘటం వింటారనుకున్నావా ? ముందు నించీ ఆయనకా పేరంటే ఇష్టం. ‘నా పేరులోనే నా ఆటిట్యూడ్ ఉంది తెలుసా’ అంటూ గొప్పలు పోతారు. ప్రపంచంలో ఎవరైనా కోరుకునేది బ్రహ్మానందాన్నేట. దాన్నే ఇంగ్లీష్ లో బ్లిస్ అంటార్ట.. నేనిలా మొదలుపెట్టగానే ఆయనలా లెక్చర్ దంచడం మొదలు పెడతారు” నీరసంగా అంది లావు. ఇన్నాళ్లూ ఇంట్లో తనదే పై చెయ్యిగా ఉన్న లావు ‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలమయ్యె’ అన్నట్టు కనపడగానే కామాక్షికి జాలేసింది.
ఆ జాలిలోంచి మెరుపులా ‘జీవితాన్ని మార్చేసే అయిడియా’ ఒకటి వెలిగింది.
“ఆ మధ్య అతనికి రావలసిన ప్రమోషనేదో ఆగిపోయిందన్నావు కదే” అనడిగింది.
“పోతే పోయిందిలేవే వెధవ ప్రమోషన్. నాకు దాని గురించి బాధ లేదు. చస్తుంటే సంధి మంత్రం అన్నట్టు అసలు విషయాన్నొదిలేసి, ఏదేదో అడుగుతావు” విసుక్కుంది లావు.
“పూర్తిగా వినవే తల్లీ.. వెంటనే ఎవరేనా న్యూమరాలజిస్టుకి చూపించి పేరులో ఏదో నెగటివిటీ ఉందనీ, అందుకే ప్రమోషన్లు ఆగిపోతున్నాయనీ చెప్పించు. ఏదో రెండో మూడో ‘ఏ’లూ, ‘డీ’లూ పెట్టి, ఆ…నంద్ద్ అనో, లేకపోతే ఆన్నంద్ అనో... ఏదో మార్పులు రాసిస్తారు. దాంతో ఈ పేరు గొడవ వదిలిపోతుంది. అతనికెలాగూ జాతకాలూ, నక్షత్రాలూ నమ్మకాలున్నాయిగా” అంది.
తల్లి మాటలు వింటూనే లావు కళ్ళు మెరిశాయి. ఒక్కుదుటున లేచి ఆవిడకో హగ్గూ, రెండు ముద్దులూ ఇచ్చి తిరుగు బస్సెక్కింది. నలుగురు న్యూమరాలజిస్టుల్ని కలిసి ఆనందు కొత్తపేరు నిర్ధారించేసరికి చేతి చమురు బాగానే వదిలింది. తెలుగులో ఆనందనే రాసినా ఇంగ్లీష్ లో రాసేటప్పుడు కొత్త స్పెల్లింగ్ రాయడం ఆనందుకే కాక తల్లీ పిల్లలకి కూడా ఓ పట్టాన అలవాటు కాక నానా అవస్థా పడినా, మొత్తానికి అంతటితో ఆవిషయం పరిష్కారమై లావుకి శాంతి చిక్కింది.
ఈలోపు సూరీడు కూతురి నాట్యం గురించి వార్తా పత్రికల్లో ప్రోత్సాహకరమైన రివ్యూలు వచ్చాయి. సూరీడుకి ఫోన్ చేసి అభినందనలందించినా,  స్నేహితురాలితో కలిసి చూసిన ఆ పిల్ల నాట్యం గుర్తొచ్చి లావుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
‘ఎందుకొచ్చిన సంగీతం. ఎంతసేపూ సా.. పా… అంటూ సాగతీతా, దరువే గాని ఆ మువ్వల సవ్వడి ఉందా, అడుగుల అందం ఉందా, సోగ కళ్ల విన్యాసాలున్నాయా? ఎక్కడ కూచుంటే అక్కడే స్థిరో భవా అన్నట్టుండే సంగీత కచేరీకీ, ప్రేక్షకుల్ని కళ్ళు తిప్పుకోనివ్వని డాన్సుకీ పోలికెక్కడుంది’ అని లావు మనసంతా పరిపరి విధాల పోయింది. సూరీడు వాళ్ల ఊరు వెళ్లిపోతూ, లావు కూతురు ఛాయ బుగ్గలు పుణికి,  ‘ఈ ఊర్లోనే ఉంటే ఈ కోకిల కంఠాన్ని వినడానికి రోజూ మీ ఇంటికి వచ్చేదాన్ని’ అని పొగడ్తల్లో ముంచెత్తిన విషయం లావు బుర్రలోకి ఎక్కలేదు.
 ఆ మర్నాడే ఉన్న పళాన కూతురి సంగీతానికి స్వస్తి చెప్పించి, పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నాట్య కళాశాలలో చేర్పించేసింది. కూతురి ఏడుపు విని ఆనందు కల్పించుకోబోయినా “మీరూరుకోండి, రెండ్రోజులేడ్చి అదే సద్దుకుంటుంది. మీ ఇంటి పేరు నచ్చలేదని నే చేసుకోనని ఏడిస్తే మా అమ్మా నాన్నా ఊరుకున్నారా? నయానా భయానా చేసి పడెయ్యలేదూ. ఇప్పుడు మనకేం తక్కువయిందీ?” అని కొట్టి పారేసింది. గొడవ పడడం నచ్చని ఆనందు విషయాన్ని అంతటితో వదిలేసి తన పనిలో మునిగి పోయాడు.
ఇంతలో విజయవాడలో మూడ్రోజుల పాటు జరిగే ఒక సంగీత సదస్సులో ఔత్సాహిక కళాకారులకి అవకాశం ఉంటుందని తెలిసి, సూరీడు లావుకి ఫోన్ చేసింది, పిల్లని తీసుకొస్తే అక్కడ సభలో పాడించవచ్చని. ఇద్దరూ విజయవాడ వెళ్లడం, సభలో ఛాయ ముద్దుగా పాడడం జరిగాయి. కచేరీకి వచ్చిన వాళ్లంతా పిల్లనీ, ఆమెకి సంగీతం నేర్పిస్తున్న తల్లినీ మెచ్చుకుని ‘ఎంచక్కా సంగీతమైతే పెద్దయినా పాడుకోవచ్చు. పన్లు చేసుకుంటూ కూడా సాధన సాగించవచ్చు. అదే నాట్యమైతే అలా కుదరదు. ఆ నగలూ, మేకప్పులూ అదంతా ఓ పెద్ద హంగామా. చేస్తూ చేస్తూ ఉన్న డాన్సు మానేస్తే ఒక్కసారిగా ఊబకాయం వచ్చేస్తుంది కూడా. టెంతూ ఇంటరూ సమయం లో సాధన కుదరక పిల్లలు లావుగా అయిపోతారు. ఇంక పెళ్లి కుదరడం కూడా కష్టం.. ‘ అంటూ తలో మాటా అన్నారు. వెంటనే లావు నాలిక్కరుచుకుని, ‘నయం ఇప్పుడే మేలుకున్నాను. వెనక్కి వెళ్లగానే పిల్లని డాన్సూ గీన్సూ మాన్పించేసి మళ్లీ సంగీతంలో చేర్పించెయ్యాలి’ అనుకుంది.
సూరీడు రాక రాక వచ్చిన స్నేహితురాలిని ఎంతో  ప్రేమగా చూసుకుంది. సూరీడు ఇల్లు లావుకి బాగా నచ్చేసింది. ముఖ్యంగా వంటిల్లు. పొందిగ్గా సర్దిన  పెరల్ పెట్ సీసాలూ, వాటి మీద నీట్ గా రాసి అంటించిన వంట దినుసుల పేర్లూ చూసి, వెనక్కి వెళ్లగానే తన వంటిల్లు కూడా అలాగే తీరువుగా సర్దుకోవాలనుకుంది.
లేడికి లేచిందే పరుగన్నట్టు ఇంటికి వచ్చీ రాగానే మొగుణ్ని బజారుకి బయల్దేరిదీసి, ఏకంగా పాతిక పెరల్ పెట్ సీసాలు వేర్వేరు సైజులవి కొనేసి తెచ్చింది. బిల్లు చూసి ఠారుకున్న ఆనందం నెత్తీ నోరూ బాదుకున్నాడు. అతన్ని పట్టించుకోకుండా, నాలుగు రోజుల పాటు అదే పనిగా వంటింట్లో సీసాలూ డబ్బాలూ అన్నీ తీసిపారేసి, స్టిక్కర్లంటించిన కొత్త జార్లు వరసగా సర్దుకుని హమ్మయ్య అని నిట్టూర్చింది. ‘ఇంక వంటింటి పని ఎంతో తేలికయిపోతుంది. ఎప్పుడేనా ఏ పనిమీదో ఆలస్యమైనా, కుకరు పెట్టి కూర పోపులో పడెయ్యమంటే భర్తో కూతురో చేసి పెడతారు’ అనుకుని సంతోషించింది.
తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్న సామెత లావు విషయంలో నిజమై కూర్చుంది. హడావుడిగా వంట మొదలుపెట్టబోతున్న లావు, తడిబట్టతో అప్పుడే తుడిచిన టైల్స్ మీద కాలుజారి పడింది. పాదం ఇంత లావున పొంగి, నొప్పితో విల విల్లాడింది. ఆనందం ఆఫీసుకి లీవుపెట్టి కాలికి కట్టు కట్టించి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. నాలుగు వారాలు పక్క మీదే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ చెప్పాడు.
పక్క మీంచి లావు సూచనలిస్తుంటే, సగంలో ఆగిపోయిన వంటని ఆనందే పూర్తి చేశాడు. అప్పటికి ఒంటిపూట బడి పూర్తై పిల్లలింటికి వచ్చారు. ఆవురావురుమంటున్న పిల్లలిద్దరికీ ముందు అన్నాలు పెట్టి, లావుకి కూడా మంచం దగ్గరే ఇచ్చేద్దామని కంచంలో వడ్డించబోయాడు ఆనందం. ఇంతలోకే కెవ్వు కెవ్వుమని పిల్లల అరుపులు విన్పించాయి. పరుగెత్తుకుంటూ గాభరాగా వెళ్ళేసరికి ఇదరూ వాష్ బేసిన్లో నొట్లో ఉన్నదంతా ఉమ్మేసి నాలుకలు పీక్కుంటున్నారు. “ఏమయిందిరా?” అంటే “అదేం కూర నాన్నా?” అంటూబిక్క మొహాలు పెట్టారు.
 పిల్లాడి కంచంలోంచి ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తెల్లబోయాడు ఆనందం. అది తినగలిగే పదార్ధంలా లేదు. బుర్ర బద్దలు కొట్టుకుంటేఅసలు విషయం అర్ధమయింది. వేయించిన దొండకాయ ముక్కల్లో సెనగ పిండి చల్లి, జీలకర్ర పొడీ, కారం పొడీ వెయ్యమని లావు చెప్పగా సీసాలపైనున్న పేర్లు చూసి అవన్నీ వేశాడు ఆనందం. ఆ సీసాల్లో మొదట వేసిన పొళ్ళు అయిపోయాక సీసాలు కడిగి మళ్లీ నింపేటపుడు, పైనున్న పేర్లు చూసుకోకుండా, తనకి అలవాటైన పద్ధతిలో ఎదురుగా కనపడ్డ సీసాల్లో పొడులు, పిండులూ నింపి పెట్టుకుంది లావు. జీల కర్ర పొడి అని ఉన్న సీసాలో మిరియం పొడీ, సెనగ పిండి అని ఉన్న సీసాలో పచ్చిమెంతుల పొడీ ఉన్నాయని తేలింది.
లాబొరేటరీలో సీసాల్లోంచి కెమికల్స్ తీసి ప్రయోగాలు చేసినట్టే చకచకా వంట ముగించిన ఆనందం, జరిగిందానికి లావుని తిట్టిపోశాడు. లావు కూడా ఊరుకోకుండా ‘ఏదో హడావుడిలో ఒక్కోసారి చేతికందిన సీసాని అవసరానికి వాడుకోవడం ఎవరింట్లోనైనా జరుగుతుం’దనీ, ‘బ్రౌను కలర్లో ఉండే జీలకర్ర పొడి బదులు నల్లటి మిరియం పొడి కనిపిస్తున్నా బుర్ర వాడకుండా గుడ్డిగా వేసేస్తారా’ అనీ తిరిగి అంటించి, ‘అసలే కాలు విరిగి నెప్పితో ఉంటే మొగుడు చూపించే ప్రేమ ఇదేనా’ అని కళ్లనీళ్లు పెట్టుకుంది.
          పిల్లలకి పెరుగన్నం తినిపించి, లావుని సముదాయించి ఇద్దరూ భోజనం ముగించేసరికి ఆనందానికి నీరసం వచ్చింది. పూర్వం ఎప్పుడూ హుషారుగానవ్వుతూ ఉండేవాడు కాస్తా ఈ మధ్య తరచూ వచ్చి పడుతున్న కొత్త సమస్యలకి ఈసురోమంటూ తయారయాడు. ‘ఈ సూరీడు వాళ్లకి దూరంగా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయి, వీళ్ల గోల వదిలి పోతే బావుణ్ణు’ అని రోజూ దేవుణ్ని ప్రార్ధించుకోవడం మొదలెట్టాడు.
ఒకరోజు ఆనందం ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ పరిగెత్తుకొచ్చి “నాన్నా, సూరీడత్తా వాళ్లు ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నార్ట!” అని సంతోషంగా చెప్పారు. అతని మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగింది.
పిల్లలు ”నాన్నా! పార్టీ ”  అంటూ గోల చేశారు. ఆనందు “ఉష్ ! అమ్మ వింటుంది ..జాగ్రత్త” అని హెచ్చరించి, వెంటనే వెళ్లి అయిస్ క్రీమ్ పట్టుకొచ్చాడు.
అంతా కూర్చుని సరదాగా తినడం మొదలుపెట్టగానే “ఆస్ట్రేలియా లో మీ క్వాలిఫికేషన్ కి మంచి మంచి ఉద్యోగాలున్నాయిటండీ” అంటూ లావు ఏదో చెప్పబోయింది.
          ఆనందుకి కొరబోయి ఉక్కిరిబిక్కిరయాడు. మంచి నీళ్లిచ్చి అతని నెత్తిమీద మొత్తి, కాస్త సద్దుకోనిచ్చి, ఆస్ట్రేలియా గురించి మళ్లీ మొదలుపెట్టింది లావు.


                                                                             *** 

December 5, 2015

మన మహా నగరపు పుస్తకాల పండుగ

         
        ప్రతి ఏడూ డిసెంబర్ నెలలో వచ్చే పుస్తకాల పండగ, Hyderabad Book Fair, ప్రారంభమై దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది. 1985 లో 25 స్టాళ్లతో చిక్కడపల్లిలో మొదలైన ఈ బుక్ ఫెయిర్ రానురాను  విశాలమై గత రెండేళ్ళుగా సువిశాలమైన ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించబడుతోంది. 
           సాంకేతికత సాయంతో సాహిత్యం కూడా డిజిటలైజ్ అవుతున్న రోజుల్లో అచ్చులో పుస్తకాలెవరైనా కొంటున్నారా అని సందేహ పడే వాళ్ళకి, క్రితం సంవత్సరం 317 స్టాళ్ల తో లక్షల పుస్తకాలకు పది రోజుల పాటు నిలయమైన పుస్తకాల జాతర విభ్రాంతిని కలిగించింది. బుక్‌ఫెయిర్‌ చరిత్రలో ఇప్పటివరకు, ఒకే సారి 60 వేల మంది పుస్తక ప్రియులు  పుస్తక ప్రదర్శన ని సందర్శించింది లేదు. కిందటేడు పుస్తకాల పండగ మొదలైన మూడోరోజు, ఇళ్ళలో టీవీ సీరియళ్ళు మారుమోగిపోయే వేళ, కంప్యూటర్ తెరలు వెలుగులు చిందే వేళ , పుస్తకాలని వెతుక్కుంటూ అరవై వేల మంది ఎన్టీఆర్ స్టేడియంకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది, పుస్తకానికీ మస్తకానికీ ఉన్న ఆత్మీయ బంధం తెగిపోలేదని  తెలియజెప్పింది.
            పుస్తక మేళాలో ఈసారి  చోటు చేసుకున్న కొత్తదనాల్లో ఒకటి జేవీ పబ్లిషర్స్ తో కలిసి ప్రమదాక్షరి సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్. ఎంతో శ్రమకోర్చి తాము వెలువరించిన పుస్తకాలని వాటికోసం ఎదురుచూస్తున్న పాఠకులకి అందజేసే పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమన్నది ఎన్నో ఏళ్ళుగా రచయితలు ఎదుర్కొంటున్న సమస్య.
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలూ , పోటీ పరీక్షల పుస్తకాలూ, కిందటి తరంలో ప్రముఖులైన రచయితల నవలలూ, కథా సంపుటులూ బాగా అమ్ముడుపోతున్న నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ తమకున్న పరిమిత స్థలంలో ఆయా పుస్తకాలని మాత్రమే ప్రదర్శనకు పెట్టడం జరుగుతోంది. 
           సాధారణంగా సాహిత్యాభిమానులైన  పాఠకులు తమకెదురుగా కనబడుతున్న పుస్తకాలని అటూ ఇటూ తిరగేసి కాస్త బావున్నట్టనిపించిన పుస్తకాలని ఎన్నుకుని కొనుక్కుంటారు. కిందటి తరంతో పోలిస్తే ఈ తరానికి ఖాళీ సమయం తక్కువ. ఎదురుగా కనబడని పుస్తకం కోసం అడిగి, షాపులో కుర్రాడు వెతికి తెచ్చేదాకా  వేచిచూసే పాఠకులు  చాలా తక్కువ.  సమీక్షలు చదివో, అక్కడక్కడ చదివిన కథల వల్ల ఒక రచయితమీద అభిమానం కలిగో,  ‘ఫలానా పుస్తకం ఉందా’ అని ప్రత్యేకించి పాఠకులు  అడిగే సందర్భాలు ఆ రచయితకి అపురూపమైనవి.
          దురదృష్ట వశాత్తూ అలాంటి సందర్భాల్లో చాలా సార్లు, పేరున్న పుస్తకవిక్రేతలు (ఆ రచయిత పుస్తకాలు తమ గోడౌన్ లో ఉన్నాకూడా )  పాఠకులడిగిన పుస్తకం లేదని చెప్పేస్తూ ఉంటారు. దీనిక్కారణం ఆ రచయిత పట్ల కక్షో , కార్పణ్యమో కాదు.  రోజుకి డజన్ల లెక్కలో అమ్ముడుపోయే పుస్తకాలుండగా, చెదురుమదురుగా అమ్మకమయ్యే పుస్తకాలని ప్రదర్శించడానికి స్థలం వెచ్చించలేక. మరి రచయితల దగ్గర పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ నిమిత్తం ఎందుకు తీసుకుంటారో అర్ధం కాని విషయం.
         ఈ విషయంలో నాకెదురైన అనుభవం ఎందరో రచయితలకి కూడా ఎదురయ్యే ఉండాలి. నా కథలు ప్రచురితమైన ప్రతిసారీ కొందరైనా పాఠకులు ‘ మీ పుస్తకాలేవైనా పబ్లిష్ అయాయా? అయితే ఎక్కడ దొరుకుతా’యని అడగడం, నా పుస్తకాలు దొరికే షాపుల వివరాలు చెప్పడం జరిగేది. అయితే చాలా కాలం తర్వాత నాకు తెలిసిందేమంటే అలా నా పుస్తకాలకోసం  ఎవరైనా పాఠకులు తమకు దగ్గర్లో ఉన్న ఆయా బుక్ హౌస్ ల బ్రాంచిలకి వెళ్ళినా, వాళ్ళకి అడిగిన పుస్తకాలు దొరికేవి కావని. ఎప్పుడో చాలా కాలం తర్వాత అలాంటి పాఠకులు నాకు మళ్ళీ ఎదురైన (అరుదైన) సంఘటనల వల్ల నాకీ విషయం తెలిసింది. అప్పటినించి ప్రతిసారీ హైదరాబాద్  బుక్ ఫెయిర్  జరుగుతున్నపుడు నేను తప్పకుండా నా పుస్తకాలు తీసుకున్న బుక్ హౌస్ ల స్టాల్స్ దగ్గరకి వెళ్ళి ‘వారణాసి నాగలక్ష్మి గారి ఆలంబన/ఆసరా/ వానచినుకులు పుస్తకం ఉందా’ అని అడగడం, వాళ్ళు లేవని చెప్పడం పరిపాటి అయిపోయింది!
       పత్రికల్లో తమ పుస్తకానికి అద్భుతమైన సమీక్ష వచ్చినపుడు ప్రతి రచయితా ఎంతో ఎదురుచూస్తాడు ఆ పుస్తకపు సేల్స్ రిపోర్ట్ కోసం. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సమీక్షలు చదివరు. రాబోయే పాఠకుల్ని ఊహించుకుని ఆ పుస్తకాలని సిద్ధంగా పెట్టుకోరు. ఆసక్తికరంగా అనిపించిన పుస్తకం కోసం ట్రాఫిక్ భూతాల్ని ఎదుర్కొంటూ వెళ్ళిన కొద్దిమంది పాఠకులకి కోరిన పుస్తకాలు రెడీగా దొరకవు. తెప్పిస్తామని దుకాణదారులు చెప్పినా మళ్ళీ వాహనసముద్రాల్ని ఈదుకుంటూ వెళ్ళి, ఇంతోటి పుస్తకాన్నీ తెచ్చుకునే ఓపిక ఆ పాఠకుడికి ఉండదు.
       ఇలాంటి పాఠకులు  సంవత్సరంలో ఒకసారి వచ్చే పుస్తకాల పండగ కోసం ఎదురుచూస్తారు, ఒక్కచోటే అన్ని పుస్తకాలూ దొరుకుతాయి కదా అని. అయితే ఈ బుక్ ఫెయిర్ లలో కూడా వారి ఆశ తీరదు. ఎందుకంటే పెద్ద పెద్ద షాపుల్లోనే ప్రదర్శించడానికి వీలుకాని పుస్తకాలకి బుక్ ఫెయిర్లో స్థలం దొరుకుతుందా?
ఇలాంటి నేపధ్యం లో ఫేస్ బుక్  సామాజిక మాధ్యమాన్ని సాహితీ చర్చల కోసం వాడుకుంటూ సన్నిహితమవుతున్న కొందరు             రచయిత్రులు, పాఠకురాళ్ళూ  ‘ప్రమదాక్షరి’అనే ఫేస్ బుక్ సమూహంగా ఏర్పడడం జరిగింది.
కొత్త పత్రికల గురించి, కొత్త శీర్షికల గురించి, పోటీలను గురించి, తెలుసుకుంటూ, రచనల్ని మెరుగుపరుచుకుంటూ, సాంకేతిక విషయాల్లో కలిగే సందేహాల్ని నివృత్తి చేసుకుంటూ, మంచి మంచి చర్చలకు, నూతన కార్యక్రమాలకు, రకరకాసాహితీ ప్రక్రియలకు శ్రీకారం చుడుతూ, రాగద్వేషాలకు అతీతంగా కలసికట్టుగా నడవాలనే  ఆశయంతో  మంథా భానుమతి, సమ్మెట ఉమాదేవిలు అడ్మిన్స్ గా  పదిమంది కన్న తక్కువ  సభ్యులతో ఆగస్టు నెలలో  మొదలైన ఈ సమూహం  ఇంతింతై వటుడింతై అన్నట్టు నవంబర్ నాటికి తొంభై మంది సభ్యులతో నిరంతర చైతన్యానికి నిలయమయింది. ఈ ఆరు నెలల్లో నెలకో, రెండు నెల్లకో ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకుంటూ, భావాలు కలబోసుకుంటూ, సరదా కబుర్లూ, ఆట పాటలతో  సాగుతున్న ప్రమదాక్షరి  మీటింగ్స్ తో సభ్యులందరిలో కొత్త చేతన మొలకెత్తింది.
         అలా కలుసుకున్న ఒక సందర్భంలో, నేను పుస్తకాల అమ్మకం విషయంలో రచయితలు ఎదుర్కొంటున్న సమస్యని జ్యోతి వలబోజుతో చర్చిస్తూ ‘ఈ సారి బుక్ ఫెయిర్ లో మనమే ఒక స్టాల్ ఎందుకు పెట్టుకోకూడదు’ అనడం, వెంటనే ఆమె ‘ఈ సంవత్సరం బుక్ ఫెయిర్ లో మనం ఒక స్టాల్ ఏర్పాటు చేసుకుంటున్నాం’ అనడం జరిగాయి. అన్నట్టే ఇరవై తొమ్మిదవ, హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రచయిత్రుల స్టాల్ ఒకటి ఏర్పాటై చర్చనీయాంశమై చరిత్ర సృష్టించిందంటే అతిశయోక్తి కాదు. 
        జ్యోతి వలబోజు చేతల మనిషి. మాటతో పాటే సంకల్పాన్ని జతచేసే కార్య శీలి. మూడేళ్ల క్రితం ‘మాలిక’ జాల పత్రికని స్థాపించిన ఆమె, తన పత్రికలో ప్రచురణ కోసం  ‘తండ్రి- తనయ’ అనే ఇతివృత్తం మీద ప్రమదాక్షరి రచయిత్రులందరినీ కథలు రాయమని కోరింది. అతి తక్కువ వ్యవధిలో మాలో కొందరు  రాసి పంపిన  కథలన్నీ ఆగస్ట్ నెల ‘మాలిక’ లో చోటు చేసుకున్నాయి. వాటికి ఆ తర్వాత అందిన మరికొన్ని కథలని చేర్చి, 2014 సంవత్సరం మొదట్లో తను స్థాపించిన జేవీ పబ్లిషర్స్ సంస్థద్వారా, ఇరవై నాలుగు కథలతో  ఒక కథా సంపుటి  ‘ప్రమదాక్షరి కథా మాలిక - తండ్రి తనయ’ పేర (ప్రచురణ ఖర్చులు రచయిత్రులంతా కలిసి పంచుకునే పద్ధతిలో) పుస్తకంగా తెచ్చింది. దీనికి  తన వంటల పుస్తకాలు రెండు  (తెలంగాణా వంటలు వెజ్, నాన్ వెజ్), నా కొత్త పుస్తకం ‘ఊర్వశి’ నృత్య నాటిక జత చేస్తే, మొత్తం 2014 సంవత్సరం లో జేవీ పబ్లిషర్స్ బానర్ కింద వెలువరించిన పుస్తకాల సంఖ్య ఇరవై అవుతుంది. ఊర్వశి విషయానికి వస్తే ఈ 32 పేజీల చిన్న నాటికని సరిగ్గా పది రోజుల్లో డీటీపీ చేయించి బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవం నాటికి పుస్తకంగా తీసుకురావడం జ్యోతి సమర్ధతకి నిదర్శనమే.

     


         
     ప్రమదాక్షరి, జేవీ పబ్లిషర్స్ సంయుక్తంగా సహకార ప్రాతిపదికపైన తలపెట్టిన పుస్తక శాలలో రచయిత్రులూ, ప్రమదాక్షరి సభ్యులేకాక కొందరు రచయితలు కూడా తమ పుస్తకాలను చేర్చి ఈ ఆలోచన తాలూకు స్కోప్ ని పెంచారు.  పుస్తక ప్రదర్శన మొదలైన వారం రోజుల్లోనే  మేము ఏర్పాటు చేసుకున్న స్టాల్ లో అమ్మకాలు లక్ష దాటాయి. రచయితల పుస్తకాలని  మధ్యవర్తులు లేకుండా నేరుగా పాఠకులకి చేర్చడమనే ఈ ఆలోచన కార్య రూపం దాల్చడంలో ప్రమదాక్షరి సభ్యులంతా పాలుపంచుకున్నా ప్రధాన పాత్ర పోషించింది మాత్రం మంథా భానుమతి, జ్యోతి వలబోజు, కన్నెగంటి అనసూయ. 

   బుక్ ఫెయిర్ పూర్తి అయ్యాక కన్నెగంటి అనసూయ  ఇంట్లో ( తను స్వయంగా వండి వడ్డించిన ) విందులో, బుక్ ఫెయిర్లో పాల్గొన్న రచయిత్రులంతా కలుసుకుని ఎవరికి రావలసిన సొమ్ము వాళ్ళు అందుకున్నారు. సోమరాజు సుశీల గారు తనకు రావలసిన సొమ్ము తీసుకుంటూ ఇన్నేళ్ళుగా రాస్తున్నా నా పుస్తకాల కి ఒక్కసారిగా ఇంత డబ్బు ఎప్పుడూ అందుకోలేదని అన్నపుడు అందరి మనసుల్లోనూ అదే భావం కదిలింది. అంతర్జాలంలో కావలసినంత సాహిత్యం లభిస్తుండగా
ఎదురుగా ఎప్పుడూ కనబడని పుస్తకాల కోసం ఎవరైనా ఎంతని వెతుక్కుంటారు?
            కేవలం ముప్ఫై మంది మాత్రమే పాలు పంచుకున్న ఈ స్టాల్ , మిగిలిన స్టాల్స్ తో పోలిస్తే తక్కువ పుస్తకాలతో ఖాళీ ఖాళీగా అనిపించినా , సృజన కారుల్ని స్వయంగా కలుసుకుని , ముఖా ముఖీ మాట్లాడే అవకాశంకోసం చాలామంది పాఠకులు ప్రమదాక్షరి స్టాల్ కి వచ్చి పుస్తకాలు కొనుక్కున్నారు.    


         మళ్ళీ ఏడాదికి ఇదే పని మరింత విస్తృతంగా చేయాలని , తెలుగు కథకులంతా ఇదే బాట పట్టి తమ పుస్తకాలని తామే ప్రదర్శించుకునే ప్రయత్నం చెయ్యాలనీ చాలామంది రచయితలు సంకల్పించారు. ఈ పుస్తకాల పండగ ప్రమదాక్షరికి నిజమైన పండగలా జరిగిందంటే అతిశయోక్తి కాదు. చూస్తూండగానే ఏడాది గిర్రున తిరిగి వచ్చింది, కొత్త పుస్తకాల కబుర్లు మోసుకొస్తూ.

     మన దేశంలో ఎన్నో పండగలు.. ప్రతీ కూడలి లోనూ రంగురంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోతూ , డిస్కౌంట్ల వలలు విసురుతూ ఎన్నో బట్టల షాపులు.. ఈ పండగకి మాత్రం  'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో- ఒక మంచి పుస్తకం కొనుక్కో' అన్న కవి వాక్కు గుర్తు చేస్తే పాఠకులేమంటారో!