March 8, 2014

కిందటి ఆదివారం(2nd March'14) ఇప్పుడిప్పుడే తెలుగు సినీ రంగంలో గాయనిగా పేరు తెచ్చుకుంటున్న అమృత వర్షిణి మొదటి cd , 'పల్లవించనీ అమృత వర్షిణి ' విడుదల కార్యక్రమం ఉందని, తప్పక రావాలనీ అభిమానంతో ఆహ్వానిస్తూ తనూ , వాళ్ళమ్మ గారు ఆశాలత గారూ ఫోన్ చేశారు.

'CD లో మొదటి పాట మీరు  రాసినదే ' అంటే " ఏ  పాటా ? నాకు గుర్తు లేద"న్నాను. ('ట్యూన్ కి పాట  రాస్తే గుర్తు ఉండదండీ ' అంటూ రామాచారి గారు తర్వాత చెప్పారు. నిజమే! )

అప్పుడు అమృత వర్షిణి ఫోన్ లోనే ఆ పాట పాడి వినిపించాక గుర్తొచ్చింది ....కొంత కాలం క్రితం అకస్మాత్తుగా రామాచారి గారు ఫోన్ చేసి ఒక ట్యూన్ వినిపించి , దానికి అర్జెంట్ గా పాట  రాయమని అడగడం , అప్పుడు  రెందు మూడు రోజుల్లో ఈ  పాట  రాసి ఈమెయిలు లో పంపడం.

మార్చి నెలలో అకస్మాత్తుగా కురిసిన చిరు జల్లు తర్వాత ఆ  చల్లని సాయంకాలం కోఠీ , భారతీయ విద్యా భవన్ లో ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఇప్పుడిప్పుడే టీనేజ్ లోకి అడుగుపెట్టిన బాలిక  శృతి పక్వంగా, మంచి range ఉన్న చక్కని కంఠం తో cd లోని పాటలన్నీ వినిపించింది. నిర్మాతలు  శ్రీమతి నాగ సుశీల (అక్కినేని గారమ్మాయి ), శ్రీకాంత్ అడ్డాల , cd లోని ఇతర పాటల రచయితలతో (అంతా సినీ రచయితలే ) పాటుగా ఆ కార్యక్రమమం లో పాల్గొనడం , పాట రచనకు చిరు సన్మానాన్ని అందుకోవడం బాగుంది.

ఆ పసి గొంతు పాడిన నా పాట వింటుంటే  ఇలాగే ఇదివరకు నా పాటలు పాడిన కారుణ్య, ఇర్ఫాన్ అలీ ( ప్రస్తుతం bollywood singers ) , కృష్ణ చైతన్య , నాగ సాహితి , గీత మాధురి , భువన కృతి , సత్య యామిని గుర్తొచ్చారు.
ఆ పాట కి లింక్ ఇస్తూ lyric కూడా పొందు పరుస్తున్నా ను .

పాట వింటే, వాళ్ళ లాగే సినీ నేపధ్య గానం లో ఒక ఉన్నత స్థానం అధిరోహించేందుకు మరో యువ గాయని సిద్ధమవుతోందని ఒప్పుకుంటారనుకుంటా.

ప // ఆమని లో, ఓ కోకిలలా, ఒక పాట పాడాలంటే …..

ఈ వని లో, రా చిలుకై , రాగాలు తీయాలంటే ….

గుండెల్లో తడి ఉండాలి !

వెంటాడే స్వరముండాలి !

తోడుగ ఓ తాళం చాలమ్మా !

సరదాలే వికసించేలా, పరదాలే తొలగించేలా

ఉల్లాసం ఉంటే మేలమ్మా !                                       // ఆమనిలో //


చ// గుబులే పుట్టించే శిశిరానికీ ,  వెనకే కదిలే వాసంతమే !

దిగులే కమ్మేసే తిమిరానికీ , వెనకే వెలిగే ప్రత్యూషమే !

ఉప్పొంగే హృదయం కోసం , ఉదయించే నాదంలా

చిరునవ్వుల పువ్వే చాలమ్మా !

మనసుల్లో పొంగే మోదం , మొగ్గల్లో గంధంలా

మమతై వ్యాపిస్తేమేలమ్మా !                                         // ఆమనిలో //


చ// విరిసే వెన్నెల్లో విరిబాలలా , కురిసే వానల్లో గోదారిలా

మహిలో మధుమాసం తారాడగా , హృదిలో మమకారం నిండేనుగా !

మదిలో ఒక రాగం పొంగి , పెదవులపై పాటైతే

అది పంచే హర్షం చాలమ్మా!

రాగానికి భావం తోడై , తాళంతో పయనిస్తే

ఆ జంటకు సాటేదీ లేదమ్మా !                                   // ఆమనిలో//


http://www.youtube.com/watch?v=lwU8dl-hbOo

No comments:

Post a Comment