December 17, 2012


సం'సారం'


ఇటు ఇరుగమ్మ
అటు పొరుగమ్మ
అనంగీకారంగా
ఒకింత తృణీకారంగా
కారం కారంగా.... !

అయిపోయిన లీవూ
చేయక తప్పని కొలువూ
ఒడిలో పాపాయికి తోడు
బడికెళ్ళే బుజ్జాయి
రాత్రంతా నిద్ర లేని కళ్ళూ
సలుపుతున్న ఒళ్ళూ
వేడి కాఫీ నాకిచ్చి
ముద్దలూ , ముద్దులూ వాడికిచ్చి
బడికి పోయే బండెక్కించి
ప్రేమ పొంగే కళ్ళతో
జ్వరానికి మందేస్తావు !

అవ్వ !!  ‘మొగుడు ఆవిడేనమ్మా!
అతనేమో వట్టి వాజమ్మ! “
పక్కింటి అసూయో, అనసూయో !
ఎవరు భార్యోఎవరు భర్తో ..
మనకైనా తెలుస్తేగా...
ఎక్కడుంటుందో తెలీని
 ఆ మనసంతా మమతేగా !

రోజులు నెలలవుతూ
నెలలు సంవత్సరాలవుతూ
తీరిక లేని ఉద్యోగాలు
పని తెమలని ఉదయాలవుతుంటే
నే వేసిన జడకీ , నువ్వేసిన జడకీ
జంట కుదరక
బుంగ మూతితో మన పాపాయి!

మరీ ఇంతగా పని పంచుకోవాలా?
నే ఉప్పేసిన కూరలోనే నువ్వూ వేస్తే
ఆ వంట రుచేం కావాలోయీ ??
నొక్కగా నొక్కగా పక్కిళ్ళ బుగ్గలు
సొట్టలవుతాయి!
ఎవరేమన్నా నీ పెదవులపై
చిరునవ్వులే ఒలుకుతాయి!
నీ సంపాదన నా సంచీలో పెడితే
లెక్కపెట్టి నే ససేమిరాఅంటే
సర్దుకుని సరేరా అంటావు!!

జీవితంలో ఒకరికి ఒకరైతే
ఇతర్ల గొడవుండదు సుమా!
అమృతంలో మునిగి పోయినా
చావుండదుగా  నేస్తమా !

(నవ్య వారపత్రిక లో ప్రచురితం)

4 comments:

  1. సంసారంలో సారం ఎలా వుండాలో చాలా అందంగా చెప్పారు. అభినందనలు...

    ReplyDelete
  2. చాలా బాగారాసారండి.

    ReplyDelete
  3. ధన్యవాదాలు శ్రీ లలిత గారు,పద్మార్పిత గారు ! రచయితకి feed back ఊపిరినిస్తుందన్నది తెలిసిన విషయమే.సమయం వెచ్చించి స్పందన తెలియజేశారు.కృతజ్ఞతలు!

    ReplyDelete

  4. ఒకరికొకరు తోడై నడిచే సంసారం గురించి బాగా చెప్పారు.
    "జీవితంలో ఒకరికి ఒకరైతే, ఇతర్ల గొడవుండదు సుమా!" ముఖ్యంగా ఈ నాటి జంటలకి ఇవి చాలా కావల్సిన మాటలు. అనసూయల అసూయలు పక్కిల్లకే పరిమితమయ్యేవి ఒకప్పుడూ. ఇప్పుడు వారి పరిధి ఫేసుబుక్ లోకి కూడా పెరిగి ఆశ్చర్యకరంగా ఉంది. Naren





    ReplyDelete